సర్వైశ్వర్య గణపతి రూపు
అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు, దుష్టగ్రహాల పీడలను నివారిస్తుంది సర్వైశ్వర్య గణపతి రూపు. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. సర్వైశ్వర్య గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో వివరంగా వివరించబడివుంది.
గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడుతోంది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశపురాణం ఘోషిస్తోంది. వేద వేదాంగాలు, శాస్ర్తాలు అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత – పోషకుడు. వారు సర్వైశ్వర్య గణపతి రూపును ధరంచడం మంచిది. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోక, అన్నిటా విఘ్నాలు కలుగుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు, జీవితంలో అనేక రకాలయిన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానారకాలైన బాధలు అనుభవించే వారు యథాశక్తి సర్వైశ్వర్య గణపతి రూపును ధరిస్తే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతోబాటు, కార్యజయం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
సర్వైశ్వర్య గణపతి రూపును మొదటిసారి ధరంచే రోజు తెల్లని వస్త్రాలు ధరించి, సర్వైశ్వర్య గణపతి రూపుకు చందన కుంకుమలతో అలంకరించి, నాలుగు వత్తులతో దీపారాధన చేసి, నారికేళము, అరటిపండ్లు నివేదించి, ‘‘వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’’ అని చదివి ‘ఓం గం గణపతయే నమః’ అనే గణేశ మంత్రాన్ని 21 మార్లు పఠిస్తూ గరికతో పూజించాలి. హారతి ఇచ్చేటపుడు ‘‘ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్’’ అనే గణపతి గాయత్రి మంత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ విధంగా పూజించి సర్వైశ్వర్య గణపతి రూపును ధరంచడం ద్వారా లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురి ఆశీస్సులు లభిస్తాయి. సకల దోషాలూ పోయి, సత్ఫలితాలు, కార్యజయం, సర్వైశ్వరాలు కలుగుతాయని ప్రతీతి.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి